పత్రికా ప్రకటన.                              తేది.3.10.2020

 

  • ·     రెవిన్యూ శాఖలో పనిభారం పెరిగింది – నిదులు లేవు  - సెలవులు లేవు – సౌకర్యాలు అసలే లేవు
  • ·        రేయింబవళ్ళు కష్టపడుతున్న తగిన గుర్తింపు లేదని రెవిన్యూ ఉద్యోగుల ఆవేదన
  • ·        సరిపడా సిబ్బంది, నిధులు మౌలిక వసతులు కల్పించి రెవిన్యూ శాఖను పటిష్ట పరచాలి

 

బ్రిటిష్ కాలం నాటి నుండి రెవిన్యూ వ్యవస్థకు ఒక మంచి పేరు కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. బ్రిటీష్ వారు కూడా రెవిన్యూ శాఖను గుండెకాయలా భావిస్తూ ఈ శాఖలేనిదే రాజ్యం లేదు అన్న విధంగా  అప్పట్లోనే రెవిన్యూ శాఖ ప్రాముఖ్యతను గుర్తించి ఈ శాఖకు ఎంతో  పటిష్టమైన భవనాలు, చక్కటి వసతులు కల్పించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడబట్టే వారు పరిపాలించినంత కాలం తిరుగులేని ఫలితాలను సాధించారు మరియు వ్యవస్థలను శాసించారు.                                                                               

ఆనాడు అప్పటి జనాభా ప్రాతిపదికన రెవిన్యూ కార్యాలయాలు నిర్మించుకొని,  సిబ్బందిని నియమించుకొని మౌలిక వసతులు కల్పించి “భూమితోనే బ్రతుకు అలాగే భూమితోనే భవిష్యత్తు” అన్న ఏకైక నినాదంతో వ్యవసాయ ఆధారిత దేశమైన భారతదేశంలో భూమిని నమ్మిన రైతుల శ్రేయస్సును నిరంతరం కాంక్షించే రెవిన్యూ శాఖను పటిష్ట పరచి ఈ శాఖ ద్వారా కట్టుదిట్టమైన చట్టాలను అమలుపరచి అత్యంత విజయవంతమైన ఫలితాలను సాధించారు.

రెవిన్యూ శాఖను పటిస్టపరచుటకు, ప్రజలకు నీతివంతమైన పాలన అందించుటకు ప్రభుత్వం తక్షణమే ఈ క్రింది చర్యలను చేపట్టాలని కోరుతున్నాము.

1)   80 దశకంలో కేవలం యాభై వేలమంది జనాభాకు సేవలందించుట కొరకు ఒక తహసిల్దార్ కార్యాలయము మరియు సిబ్బంది ఉండడం వలననే అత్యంత సమన్వయముతో కూడిన చక్కటి పరిపాలన  ఉత్తమ ఫలితాల సాధన సాధ్యమైనవి. కానీ ఈనాడు జనాభా విపరీతంగా పెరిగి అనగా అప్పటి జనాభాకు దాదాపు పదిరెట్లు జనాభాకు సేవలందించుటకు అదే మండల / తహసిల్దార్ కార్యాలయము అదే సిబ్బంది ఉన్నారు. కార్యాలయాలు పెరగలేదు, సిబ్బంది పెరగలేదు, కనీస మౌలిక సదుపాయాల కల్పన కూడా జరుగలేదు. ఇంతటి దుర్భర పరిస్థితులలో కూడా రెవిన్యూ శాఖ మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వాలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలన్న ఏకైక ఉక్కు సంకల్పంలో భాగంగా వెలుగును పంచుతూ తాను కరిగిపోతున్న కొవ్వొత్తిలా తయారయ్యింది. నేడు “పని భారం - పని భారం పని ఒత్తిడి... పని ఒత్తిడి” ఈ మాట వింటేనే గాడిద గుర్తు వస్తుంది. బండెడు చాకిరి చేసినా నిందలు అవమానాలు తప్పటంలేదు.                               

ప్రస్తుత ప్రభుత్వము వచ్చిన తరువాత పూర్తిగా అచేతనంగా పడి వున్న రెవిన్యూ శాఖ మళ్ళీ జవసత్వాలు నింపుకుంటుందని ఆశ కలిగింది, ఎలా అంటే ఈ ప్రభుత్వం రాగానే “భూములను రీ సర్వే చేయిస్తాము” అన్న ప్రకటన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నోటినుండి వెలువడగానే రెవిన్యూ శాఖకు ఉన్న ఇబ్బందులు, కోర్టు తగాదాలు, అన్ని తగ్గి ఉపసమనం కలుగుతుంది అన్న భరోసా అందరు రెవిన్యూ ఉద్యోగుల్లో వ్యక్తమైంది. కానీ దీని కొరకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించకుండా, ప్రస్తుతం ఉన్న అధికరులతోనే పనిచేయించాలని ఉన్నత అధికారులు ఆలోచన చేస్తున్నారని తెలిసి ప్రస్తుతం వున్న పని ఒత్తిడి త్వరలో ఇంకా పెరగబోతుందని రెవిన్యూ ఉద్యోగులలో ఆందోళన మొదలైంది.                                                         

నేటి ప్రభుత్వం గ్రామ స్థాయిలో సచివాలయాలు ఏర్పాటుచేసి గ్రామస్థాయిని ప్రక్షాళన చేసారు అక్కడ VROలకి, పంచాయతి కార్యదర్శులకు పని భారం తగ్గించారు. చాల సంతోషం. గ్రామస్తాయిలో పనిభారం తగ్గింది కానీ అదే విధముగా మండల స్థాయిలో రెవిన్యూ కార్యాలయాలను మరియు సిబ్బందిని, అలాగే డివిజన్ స్థాయి కార్యాలయాలను మరియు సిబ్బందిని మరియు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి  కార్యాలయాలను మరియు  సిబ్బందిని ప్రస్తుతం వున్న జనాభా/పనిభారం ప్రాతిపదికన పెంచాల్సింది పోయి బ్రిటీష్ కాలం నాటి మరియు  మండల వ్యవస్థ ఏర్పడినాటి నుండి నేటికి పెంచకపోవడం వలన మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు రెవిన్యూ ఉద్యోగులు మానసిక, ఆర్ధిక ఇబ్బందులకు గురై ధీర్గకాలిక వ్యాదుల బారిన పడుతున్నారు. కావున ప్రభుత్వం తక్షణమే గ్రామస్థాయిలో వలె, ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించి మండల /డివిజన్ / జిల్లా / రాష్ట్ర స్థాయి కార్యాలయాలను జనాభా మరియు పనిభారం ఆధారంగా కార్యాలయాలను, ఉద్యోగుల సంఖ్యను పెంచాలని, అదేవిదంగా తక్షణమే ఇతర శాఖల పనిని రెవిన్యూ ఉద్యోగులకు అప్పచెప్పకుండా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని కోరుచున్నాము.

2) రెవిన్యూ శాఖ పరిస్థితి ఈనాడు ఎలా వుంది అంటే, కార్యాలయాలు శిధిలావస్తకు చేరుకున్నాయి, తీవ్రమైన వర్షాలకు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొని వుంది. ప్రత్యేకంగా తుఫాను ప్రాంతాలలో లోతట్టు ప్రాంత ప్రజలను సైక్లోన్ షెల్టర్స్ బాగా లేకపోతె తహసిల్దార్ కార్యాలయాలకు తరలిస్తాం... కానీ అవే తాహసిల్దార్ కార్యాలయాలు శిధిలావస్థకు చేరితే ప్రజలను ఏవిధంగా కాపాడాలి. అలాగే తహసిల్దార్     కార్యాలయాల్లో కనీస వసతులు లేక ప్రత్యేకంగా మహిళా ఉద్యోగినులు అనేక పడుతున్న ఇబ్బందులకు గురై రోగాల భారిన పడుతున్నా  పట్టించుకునే నాధుడే లేడు. కావున ప్రభుత్వం తక్షణమే శిధిలావస్తకు చేరుకున్న తహసిల్దార్ / ఆర్.డి.ఒ. కార్యాలయాలను గుర్తించి నూతన భవనాల నిర్మాణానికి తగిన ప్రతిపాదనలు జిల్లా కల్లెక్టర్ల నుండి వెంటనే తెప్పించి నిర్మాణాలను చేపట్టాలని కోరుతున్నాము.

3) ప్రస్తుతం, కోవిడ్ విధులలో నిమగ్నమై ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పధకాల అమలులో రాజీ పడకుండా కుటుంబాలకు దూరమై శ్రమిస్తూ నిత్యం విధులలో మమేకమై సాగుతున్న తరుణంలో దురదృష్ట వశాత్తు కోవిడ్ భారిన పడి మరణించిన ఏ ఒక్క రెవిన్యూ ఉద్యోగికి ఒక్క పైసా ఎక్సగ్రేషేయాను చెల్లించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. కోవిడ్ వలన మరణించిన వారి జాబితాలో ఇతర శాఖల ఉద్యోగుల కన్నా రెవిన్యూ శాఖ జాబితా పెద్దగా వుంది అంటే పరిస్థితి మీరు అర్ధం చేసుకోవచ్చు.  ఉద్యోగులకు మెరుగైన చికిత్సను అందించాలన్న సంకల్పంతో తెరపైకి వచ్చిన హెల్త్ కార్డులు అనారోగ్య కార్డులై చివరికి తెరమరుగై పోయి వెక్కిరించే పరిస్థితి దాపురించినది. కోవిడ్ తో అనారోగ్యం పాలై లక్షల రూపాయలు వైద్య ఖర్చులకు చెల్లించలేక అప్పుల పాలై రోడ్డున పడుతున్నారు ఈనాడు రెవిన్యూ ఉద్యోగులు. కావున ప్రభుత్వం వెంటనే విధి నిర్వహణలో ఉండి కోవిడ్ భారిన పడి మరణించిన రెవిన్యూ ఉద్యోగులకు ఎక్సగ్రేషేయాను ప్రకటించాలని, అనారోగ్య / కోవిడ్ బారిన పడిన ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ పథకం అమలు చేసి కొనసాగించాలని కోరుతున్నాము.                                                             

4) ప్రోటోకాల్ నిధులు రావు, కంటిన్జెంట్ నిధులు రావు, ఎలక్షన్ నిధులు రావు, కోవిడ్ -19 కొరకు ప్రస్తుతం ఖర్చు పెడుతున్న లక్షలాది రూపాయలు అసలే రాలేదు,  వీటి కొరకు ఉద్యోగులు అప్పులు చేసి అవమానాలకు చీత్కారాలకు గురౌతున్నారు. తీవ్రమైన పని ఒత్తిడి, ఎడతెరిపిలేని సమావేశాలతో క్షణం తీరికలేక కనీసం ఆరోగ్యపై దృష్టి పెట్టలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితులలో నేడు రెవిన్యూ ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. కావున తక్షణమే ప్రభుత్వం 2019 లో సాదారణ ఎన్నికల కొరకు జిల్లలో పెట్టిన డబ్బులు, ప్రోటోకాల్ కొరకు నిధులు, కంటిన్జెంట్ నిధులు, మీసేవ ద్వార తహసిల్దార్లకు రావలసిన వాటా, సరిపడా అద్దె వాహనాల డబ్బులు ఇటీవల  కోవిడ్ -19 కొరకు ప్రస్తుతం ఖర్చు పెడుతున్న లక్షలాది రూపాయలు తధితర నిధులు సంభందిత జిల్లా కల్లెక్టర్ల ద్వారా నివేదికలు వెంటనే తెప్పించుకొని తక్షణమే తాహసిల్దార్లకు  చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.                                                                                                     

5) పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఆదివారాలు అసలేలేవు. సెలవులు దొరకవు, అతికష్టం మీద శెలవు దొరికినా సెలవునాడు, పండుగ నాడు కూడా టెలికాన్ఫరెన్సులు అని, ఆ నివేదికలు ఈ నివేదికలు అని ఉన్న పండుగ వాతావరణాన్ని కూడా దండుగ వాతావరణంగా మార్చుతున్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండి పోయింది యావత్తు రెవిన్యూ ఉద్యోగ లోకం. కావున నేడు రెవిన్యూ శాఖలో 50% పైన మహిళా ఉద్యోగినిలు ఉన్న రీత్యా, రాత్రుళ్ళు మరియు శెలవు దినాలలో టెలికాన్ఫరెన్సులు/ వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించకుండా తగిన కఠినమైన ఆదేశాలు  అందరూ జిల్లా కల్లెక్టర్లకు గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయము నుండి ఇవ్వాలని కోరుతున్నాము.                                     

    వినూత్నమైన ఆలోచనలతో ఉహించని, ఉహించలేని లెక్కకు మించిన సంక్షేమ పధకాలతో దూసుకెలుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజలకు మెరుగైన, వేగవంతమైన, నిజాయితీతో సేవలు అందజేయటానికి రెవిన్యూ శాఖను మండల /డివిజన్ / జిల్లా / రాష్ట్ర స్థాయిలో జనాభా/ పనిభారాన్ని బట్టి కార్యాలయాలు, ఉద్యోగుల సంఖ్యను పెంచి, రెవిన్యూ ఉద్యోగుల మనోభావాలను పరిగణన లోనికి తీసుకుని మాకు రావలసిన నిధులు, కనీస అవసరాలను తీర్చి, రైతుకు, భూమికి జవాబుదారీ అయిన రెవిన్యూ శాఖలో ప్రత్యేకంగా రీ సర్వే మరియు భూ రికార్డులు నవీకరణ చేయడం ద్వారా రెవిన్యూ శాఖను పట్టిష్ట పరచాలని కోరుతూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటునట్లు మెరుగైన, వేగవంతమైన, నిజాయితీతో కూడిన సేవలు అందించడంలో మా రెవిన్యూ ఉద్యోగులు ముందు ఉంటామని, కష్టపడి నిజాయితీతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచిపేరు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేస్తున్నాము.

(ప్రధాన కార్యదర్శి)                                                                          (అధ్యక్షులు)

 

                                                 (కోశాధికారి)