పత్రికా ప్రకటన
AP JAC అమరావతి
తేదీ.30.9.2020
***
ఏపీ జెఏసి అమరావతి పక్షాన ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమం కోసం మరియు వారికి రావలసిన జీతభత్యాల కోసం ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ నందు చీఫ్ సెక్రెటరీ గారిని, ఫైనాన్స్ సెక్రెటరీ గార్ల కార్యాలయాలను సందర్శించి ప్రత్యేకంగా వారి జీతభత్యాలు గురించి AP JAC అమరావతి పక్షాన మెమోరాండం సమర్పించడం జరిగింది.
● సదరు మెమోరాండంలో 2002వ సంవత్సరం లో ప్రారంభించబడిన కాంట్రాక్టు వ్యవస్థలో చాలీచాలని జీతంతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు రావలసిన జీతభత్యాల విషయంలో అలసత్వం జరుగుతుందని, 2002వ సంవత్సరం నుండి కాంట్రాక్టు వ్యవస్థ లో పనిచేస్తున్న వారికి సంవత్సరానికి ఒకసారి " *కంటిన్యూషన్* " పేరుతో వారి కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని, ఈ కంటిన్యూషన్ ఉత్తర్వులు ఉంటేనే వారికి జీతాలు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
● కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతినెల మొదటి తారీఖున జీతాలు చెల్లించాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా కాంట్రాక్టు వారి జీతభత్యాల చెల్లింపు ఈ విషయంలో ఎట్టిపరిస్థితిలో ఆలస్యం జరగకుండా చూడాలని ప్రతినెల ఒకటో తారీఖున జీతాలను చెల్లించులాగున చర్యలు తీసుకోవాలని సూచించారు.
● ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగస్తులకు ఆగస్టు 31 వ తారీకు తో కొనసాగింపు ఉత్తర్వులు సమయం అయిపోయింది. వారికి కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వకపోగా, రాష్ట్రంలో ఎంత మంది కాంట్రాక్టు ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు లెక్క తెలియాలి అందుకని ప్రతి శాఖ యొక్క శాఖాధిపతుల నుండి *జస్టిఫికేషన్* రిపోర్టు కావాలి అది వస్తేనే తదుపరి కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తామని తెలియజేశారు.
● ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని 10/ 7/2019 లో (GO No.1567 GAD) ఒక దానిని, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లతో కూడిన వర్కింగ్ కమిటీని GO Rt No.2657 GAD, dt.26.11.2019న ఏర్పాటు చేస్తూ వారి సూచనలు సలహాలు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వారికి ఇవ్వటానికి ఏర్పాటు చేయడం జరిగింది. వర్కింగ్ కమిటీ చైర్మన్ గారైన్ చీఫ్ సెక్రెటరీ గారు అనేక దఫాలుగా ఈ విషయమై మీటింగులు ఏర్పాటు చేసి రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య, పనిచేస్తున్న విధానాలు, వారు ఉద్యోగాలలోకి వచ్చిన విధానాలు అన్నిటినీ క్రోడీకరించి సేకరించి ఉన్నారు. సదరు వర్కింగ్ కమిటీ యొక్క గడువు జూన్ 30వ తారీకు తో ముగిసిపోయింది కానీ ఇంతవరకు వర్కింగ్ కమిటీ వారి యొక్క సూచనలను ప్రభుత్వానికి తెలియజేయలేదు. *అయితే వర్కింగ్ కమిటీ గడువు ముగిసి పోయిన రెండు నెలలకు ఇప్పుడు జస్టిఫికేషన్ పేరుతో కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలను నిలుపుదల చేసే విధంగా రిపోర్టు అడగటం అన్యాయం అని తెలియజేస్తున్నాము.*
● రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత దానికి ఉద్యోగి జీతభత్యాల ముడిపెట్టడం మంచి పద్ధతి కాదు అని ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ గారు తెలియజేశారు.
●● కావున ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న షుమారు 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు జస్టిఫికేషన్ నివేదికతో (వారికి కావలసిన రిపోర్టులను వారే తెప్పించుకొని) సంబంధం లేకుండా, వెంటనే జీతభత్యాలు చెల్లించే విధముగా ఫైనాన్స్ శాఖ వారికి ఆదేశాలు జారీ చేయాలని అసలే తక్కువ జీతంతో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం జరుగకుండా వెంటనే కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు ఉత్తర్వులు తక్షణమే జారీ చేయాలని కోరడం జరిగింది.
● ఈ కార్యక్రమములో APJAC అమరావతి సెక్రెటరీ కనరల్ శ్రీ. వై. వి.రావు గారు, కోశాధికారి శ్రీ VV మురళీకృష్ణ నాయుడు గారు, గుంటూరు జిల్లా APJAC అమరావతి చైర్మన్ శ్రీ. కె. సంగీత రావు, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘ నాయకులు శ్రీ. S. జాన్ హెన్రీ తదితరులు పాల్గొన్నారు.

0 Comments
Thanks For Your Valuable Feed Back