తేదీ 08.02.2020

ఆంధ్రప్రదేశ్ గౌ. ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి

మెమొరాండం సమర్పించడమైనది.

గౌరవనీయులైన అయ్యా!

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు విశ్రాంత ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ( ఏపీ జేఏసీ అమరావతి) తేది.08.02.2020 న తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ నందు నిర్వహించిన విస్తృత స్థాయి రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నందు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు ఏపీ జేఏసి అమరావతిలో సభ్య సంఘాల అయిన 90 శాఖల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత కాంట్రాక్టు మరియు ఔట్సొర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్స్ యొక్క రాష్ట్ర అధ్యక్ష - ప్రధాన కార్యదర్శులు మరియు జిల్లా జేఏసీల యొక్క చైర్మన్ మరియు జనరల్ సెక్రటరీలతో సుదీర్ఘంగా చర్చించిన మీదట ఈ క్రింది తెలిపిన విధానపరమైన సమస్యలను రిప్రజెంటేషన్ రూపంలో ప్రభుత్వానికి పరిష్కారం కొరకు సమర్పించాలని నిర్ణయం తీసుకొనడమైనది. 

సి.పి.ఎస్ విధానం రద్దు : గౌ.ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ లో సుమారు రెండు లక్షల ఉద్యోగ కుటుంబాలు ఆతృతగా ఎదురు చూస్తున్న అంశం ‘సి.పి.ఎస్. విధానం రద్దు’. కావున కాలయాపన లేకుండా నివేదిక తెప్పించుకుని “సి.పి.ఎస్” విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 

మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయానికి ఎ.పి జేఎసి అమరావతి కట్టుబడి ఉంటుంది... అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగసంఘాలతో చర్చించి రాజధాని తరలింపు వలన ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి:రాజధాని మార్పు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి  ఉంటామనే విషయాన్ని ఇదివరకే AP JAC అమరావతి పక్షాన తెలిపియున్నామని, నేటి రాష్ట కౌన్సిల్ సమావేశంలో సుదిర్ఘముగా చర్చించిన తర్వాత “ మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయానికి ఎ పి జే ఎ సి అమరావతి కట్టుబడి ఉంటుందని ఏకగ్రీవంగా తీర్మానిస్తూ.... ఇప్పటికే గత అనేక సంవత్సరాలుగా  హైదరాబాద్ లో స్థిరపడి ఇళ్లను, ఆస్తులను వదులుకొని అమరావతికి వచ్చి, గత 3-4 సంవత్సరములుగా అనేక వ్యయ ప్రయాసలకోర్చి ఇప్పుడిప్పుడే అమరావతిలో స్థిర పడుతున్న సందర్భంలో మరలా ప్రభుత్వ పాలన వికేంద్రీకరణలో భాగంగా వివిధ శాఖల రాష్ట్ర శాఖాధిపతుల  కార్యాలయాలు మరియు రాష్ట్ర స్ధాయి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులనుమరొకసారి విశాఖపట్నానికి తరలి వెళ్ళవలసి వస్తున్నందున, పరిణామాల వలన వర్గానికి కలగనంత నష్టాలను, కష్టాలను, బాధలను ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఎదుర్కొనవలసి వస్తునందున, వాటిని అధిగమించేందుకు ప్రభుత్వంఉద్యోగసంఘాలతో చర్చించి తద్వారా ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని కోరారు.       
ఉద్యోగులపై పని వత్తిడి తగ్గించాలి : ముఖ్యమంత్రి గా శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు భాద్యతలు చేపట్టిన తదుపరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన నవరత్నాలు అమలు వద్ద నుండి ప్రభుత్వం తలపెట్టిన ఏ కార్యక్రమమైనా వైఫల్యాలకు తావులేకుండా ప్రజలకు చేర్చడంలో ఉద్యోగులు ప్రధాన భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే క్షేత్ర స్థాయిలోని పనిచేస్తున్న ఉద్యోగులకు నిర్దిష్టమైన సమయపాలన లేకుండా ఏకకాలంలో అనేక భాద్యతలు అప్పగించడం. రాష్ర స్థాయిలో ఇచ్చిన అతి తక్కువ సమయాన్ని, పై అధికారులు మెప్పు కోసం క్షేత్రస్థాయిలోని ఉన్నతాధికారులు వారి క్రింది మండల స్థాయి అధికారులకు మరియు ఉద్యోగులకు మరింత తక్కువ సమయం కేటాయిస్తూ శెలవు దినాలు పండగల రోజులలో కూడా మినహాయింపు లేకుండా వత్తిడి పెట్టడం వలన తీవ్రంగా మానసిక వత్తిడికి గురై శారీరకంగా కృంగిపోతూ అనారోగ్యం పాలౌతున్నారు. కావున కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగులకు మోయలేని పనిభారం మోపకుండా, యంత్రాలను వినియోగించినట్లు కాకుండా, నిర్దిష్టమైన పని అంచనాతో మండల స్థాయి అధికారులకు తగినంత సమయము కేటాయిస్తూ పనులు అప్పగించే విధంగా ఉన్నతాధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలి .


11 వ PRC అమలు ; పి.ఆర్.సి. కమిషనర్ నివేదిక సమర్పించడానికి ఇప్పటికే రెండు సార్లు సమయాన్ని పొడిగించినందున. కంప్యూటర్లు, సాప్ట్ వేర్ మరియు పరిజ్ఞానం కలిగిన సిబ్బంది అందుబాటులో ఉన్నందున తదుపరి పొడిగింపు లేకుండా 11వ PRC నివేదిక వెంటనే తెప్పించుకొని యధాతదంగా ఆమోదించాలి. 

ACB దాడులు నిజాయతీ గల  ఉద్యోగుల వారి కుటుంబ సభ్యుల మానసిక స్థితి పై ప్రభావం పడకుండా చూడాలి అవినీతి కి పాల్పడుతున్న లేదా ప్రజలను ఏ విధంగానైనా ఇబ్బందులు పెట్టే ఎటువంటి ఏస్థాయి ఉద్యోగి/అధికారినైనా ఎపి జెఎసి అమరావతి ఎట్టిపరిస్థితులలో సమర్ధించదు – అయితే ACB వారు చేస్తున్న కార్యాలయాల తనిఖీల సందర్బముగా నిజాయతీ ఉద్యోగుల మరియు వారి కుటుంబ సభ్యుల మానసిక స్థితి పై ప్రభావం పడకుండా చూడాలి. మరియు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులలో నేరం నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే అరెస్ట్ లు చెయ్యాలి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు పదవీ ప్రమాణం చేసిన తొలి రోజునుండి రాష్టంలో అవినీతిని అంతం చేయడాన్ని ప్రధాన అజెండా గా పెట్టుకొని, అనుకొన్న విధంగా అటు రాజకీయ, ప్రజా వ్యవస్థాల్లోను మరియు ఇటు ఉద్యోగ వ్యవస్థలోను అవినీతి అంతానికి తీసుకొంటున్న పటిష్టమైన చర్యలను ఏపి జేఎసి అమరావతి పక్షాన స్వాగతిస్తున్నాము. 
ఈ పరిణామాలపై రాష్ట కౌన్సిల్ సమావేశములో సుదీర్ఘముగా చర్చించిన మీదట లక్షల మంది ఉద్యోగులలో అతి తక్కువ సంఖ్యలో ఉన్న ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న ఉద్యోగులు మరియు అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడాన్ని సమర్ధిస్తూనే, దివంగత ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.రాజశేర్ రెడ్డి గారు ఉద్యోగులపై పెడుతున్న ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులపై గతంలో పూర్తిగా సమీక్షించి కేసు నిర్ధారణ అయ్యేవరకు అరెస్టులు చేయవద్దని ఇచ్చిన ఉత్తర్వులను తదుపరి ఎసిబి వారు వేసిన కేసులో ఇచ్చిన కోర్టు ఉత్తర్వులు ద్వారా సదరు ఉత్తర్వులు అమలుకాకుండా ఆగిపోవడం జరిగినది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులలో 80 % కేసులు కోర్టులలో విగిపోతున్న విషయం అందరికి తెలిసినదే. విగిపోయిన కేసులకు సంభందించి కూడా అప్పటికే ఆయా ఉద్యోగులు రిమాండుల పేరుతో నెలల తరబడి జైళ్లలో ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కావున ‘కోర్టులలో కేసు నిర్ధారణ కాకుండా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులలో ఉద్యోగులను మరియు అధికారులను ముందస్తు అరెస్ట్ చేయకుండా గత ఉత్తర్వులనే కొనసాగించాలి. 
అవినీతి కి పాల్పడుతున్న లేదా ప్రజలను ఏ విధంగానైనా ఇబ్బందులు పెట్టే ఎటువంటి ఏస్థాయి ఉద్యోగి/అధికారినైనా ఎపి జెఎసి అమరావతి ఎట్టిపరిస్థితులలో సమర్ధించమని, అదేవిధంగా ఈమద్య ఎ.సి.బి అధికారులు ప్రభుత్వ కార్యాలయపు రికార్డులు పరిశీలన సందర్భంగా... పని వత్తిడిలో తగినంత సమయం లేనందున, ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా చేసే పాలనా పరమైన చిన్న చిన్న పొరపాట్లను ,దశాబ్దాల క్రితం తయారుచేసి కాలానుగుణంగా మార్పుచేయని చట్టాలప్రకారం ప్రభుత్వానికి పిర్యాదులు చేస్తున్నందున, ఉద్యోగులందరూ బయపడి అక్కడ ఒక బయానక వాతావణం ఏర్పడటం, ఉద్యోగులు అత్యవసరంగా చేయవలసిన పనికంటే వ్యవస్థాపరంగా ఉద్యోగం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఉద్యోగులపై మానసిక వత్తిడి ఉంటున్నందున, తద్వారా ప్రభుత్వ పాలనపై ప్రభావం పడకుండా మరియు నిజాయతీ ఉద్యోగుల మరియు వారి కుటుంబ సభ్యుల మానసిక స్థితి పై ప్రభావం పడకుండా ప్రభుత్వం ACB అధికారులకు తగిన సూచనలు చేయవలసినది గా కోరడమైనది’

పెండింగ్ లో ఉన్న నాలుగు (4) విడతల కరువుభత్యం (DA) వెంటనే విడుదల చెయ్యాలి :నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ ,రవాణా తదితర రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నందున, ఉద్యోగులకు ఇప్పటికే బకాయి ఉన్న నాలుగు విడతల కరువు భత్యం వెంటనే విడుదల చేయాలి.

ఎంప్లాయిస్ హెల్త్ కార్డ్స్ పూర్తి స్థాయిలో అమలు : గతంలో ప్రభుత్వోద్యోగులు విశ్రాంత ఉద్యోగుల వైద్యఖర్చులు సొంతంగా చెల్లించి, తదుపరి బిల్లులు సమర్పించి ప్రభుత్వం నుండి ఆ సొమ్ము తిరిగి పొందేవారు. ఈవిధానం లో ఖర్చు పెట్టిన సొమ్ము మొత్తం రాకపోవడం మరియు ఆలస్యంగా బిల్లులు మంజూరు కావడంలాంటి అనేక కారణాలతో సదరు విధానం లోపభూయిష్టం గా మారినందున, దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఉద్యోగుల కొరకు ప్రత్యేకంగా ‘ ప్రభుత్వం మరియు ఉద్యోగుల భాగస్వామ్యం’ తో ఎంప్లాయిస్ హెల్త్ కార్డులు జారీచేసి ‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీం’ ప్రవేశపెట్టి 6 సంవత్సరాలు పుర్తిగావస్తున్నా ఇంకా హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో వినియోగం లోనికి రాకపోవడం ప్రతినెలా కోట్లాది రూపాయిలు ఉద్యోగులనుండి వసూలు చేస్తూ వైద్య విధానం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో అన్ని ఉద్యోగుల సంఘాలు ఉద్యోగుల నెలవారీ చందాను పెంచడానికి అంగీకరించినప్పటికి నేటికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నందున ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి ఏర్పడినందున గౌ. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ప్రత్యేకముగా దృష్టి సారించి ఎంప్లాయిస్ హెల్త్ కార్డుల ద్వారా ఉద్యోగులకు , విశ్రాంత ఉద్యోగులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందించేలా తగు ఉత్తర్వులు జారీ చేయాలి . 

అఫీస్ సబార్డినేట్ (నాల్గవ తరగతి ఉద్యోగుల)ల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంపుదల: ప్రభుత్వోద్యోగులకు పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరముల నుండి 60 సంవత్సరములకు పెంచినప్పటికీ అదే సమయములో పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరములుగా ఉన్న నాల్గవ తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు గత ప్రభుత్వ హయాంలో పెంచియుండలేదు. ఈ విషయమై ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వాన్ని ఎపి జెఎసి తరపున కోరియున్నందున, చిరు ఉద్యోగులైన నాల్గవ తరగతి ప్రభుత్వోద్యోగుల న్యాయమైన కోరికను ఈ ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోని వారి పదవీవిరమణ వయస్సు 60 నుండి 62 సంవత్సరములకు పెంచాలి.

“ప్రభుత్వ వాహనాల వ్యవస్థ” పునరుద్దరణ : APSRTC ఉద్యోగులను ప్రజా రవాణా శాఖలో ప్రభుత్వోద్యోగులుగా మారుస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్న గౌ.ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు, వివిధ శాఖలలో అమలులో ఉన్న అద్దె వాహనాల వ్యవస్థలో నిధులు దుర్వినియోగమై ప్రక్కదారి పడుతున్నందున వెంటనే అద్దె వాహనాల వ్యవస్థను రద్దుచేసి “ప్రభుత్వ వాహనాల వ్యవస్థ”ను పునరుద్ధరించి ప్రభుత్వ డ్రైవర్లను నియమించాలి.
APS RTC ఉద్యోగులను ప్రజా రవాణాశాఖలో విలీనం చేసిన సందర్బంగా ఏర్పడిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : 
  • APS RTC ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా పరిగణించి ప్రజా రవాణా శాఖలో తీసుకున్నందున దశాబ్దాలుగా సంస్థలో కార్మికుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న SRBS/SBT ట్రస్టులను (రద్దుచేసినవాటిని ) కొనసాగించాలి .ప్రస్తుతం ఉన్న సౌకర్యాలన్ని కొనసాగిస్తూనే ప్రభుత్వోద్యోగులకు ఉన్న అన్ని సౌకర్యాలు అదనంగా కల్పించాలి.
  • ప్రజా రవాణా శాఖలో పనిచేసే APS RTC ఉద్యోగులకు 2004 సంవత్సానికి ముందు చేరిన ప్రభుత్వోద్యోగులకు అమలులో ఉన్న పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
  • APSRTC ఇప్పటికీ ప్రత్యెక సంస్థగానే కొనసాగుతున్నందున ప్రస్తుతం గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న ఎ.పి.ఎస్ ఆర్.టి.సి. ఎంప్లాయిస్ యూనియన్ (రి.నెం. 215 /1952) ని ప్రజా రవాణా శాఖలో కూడా గుర్తింపు సంఘంగా పరిగణించాలి.
ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలి: ప్రభుత్వ అనుమతి కోసం కోట్లాది రూపాయిలు చెల్లించి కూడా అనేక సంవత్సరాలుగా అపరిష్కృతం గా ఉన్న వివిధ జిల్లాలలోని హౌస్ బిల్డింగ్ సోసైటిలకు వెంటనే అనుమతి మంజూరు చేయాలి. అదే విధంగా ఒక సాధారణ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతాలతో ప్రస్తుతం మార్కెట్లో ఇళ్ళ స్థలాలు కొనుక్కొనే అవకాశం లేనందున, ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న వారందరికి జీవితకాలం లో ఒకసారి ప్రత్యేక ధరలకు ఇళ్ళ స్థలము కేటాయించి, సదరు భూమిని ప్రభుత్వం అభివుద్ది చేసి ఇవ్వాలి.

ఇళ్ళ స్థలాల కేటాయింపు కొరకు ప్రభుత్వం జారీచేసిన GO NO. 1937 లో విశ్రాంత ఉద్యోగులను చేర్చాలి: ఇటీవల ఉద్యోగులకు, పాత్రికేయులుకు, పాస్టర్లకు, ఇమామ్ మరియు పూజరుల ఇంటి స్థలాల మంజూరు కొరకు ప్రభుత్వం జారీచేసిన G.O.Rt.No.1937,GAD.,Dt: 28.08.2019 లో విశ్రాంత ఉద్యోగులు (Retired Employees)లను కూడా చేర్చి మరల కొత్త ఉత్తర్వులు జారీ చేయాలి.

హోమ్ గార్డులకు ప్రభుత్వ శాఖల నియామకాలలో ప్రాధాన్యత : అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ వ్యవస్థలో, పోలిస్ / ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా భాద్యతలు నిర్వర్తిస్తూ అనేక సవాళ్ళను, ప్రమాదాలను ఎదుర్కొంటూ కనీస జీతాలతో ఉద్యోగ భాద్యతలు నిర్వర్తిస్తున్న హోమ్ గార్డులను, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాష్ర ప్రభుత్వ యూనిఫాం సర్విసులైన పోలిస్, అగ్నిమాపక, జైళ్ళు, రవాణా, ప్రజా రవాణా, ఎక్సైజ్, అటవీ, జెన్ కో, ట్రాన్స్ కో శాఖలు మరియు అన్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోను గ్రూప్ ‘సి’ మరియు ‘డి’ కేటగిరి ఉద్యోగాల ఖాళీల నియామకాలలో ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చెయ్యాలి.

ప్రభుత్వ రంగ సంస్థలలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వోద్యోగుల కనీస వేతనమొత్తము నకు సమానంగా ఫించను సదుపాయం కలుగ చేయాలి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో APSRTC మొదలుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసి పదవీ విరమణ చేసిన సుమారు 2,50,000 మంది ఉద్యోగులు వారి వారి జీతాలనుండి 1995 EPF స్కీం లో పొదుపు చేసుకొన్న మొత్తము నుండి వస్తున్న పెన్షన్ కేవలం రూ. 1500/- నుండి 3000/- మాత్రమే వస్తున్నది. వయో భారంతో వేరే పని చేసుకోనలేక, వచ్చే పెన్షన్ సరిపోక, నానా అవస్థలు పడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసి పదవీవిరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల కనీస పెన్షన్ సమానంగా ప్రభుత్వ రంగ సంస్థల విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం కల్పించాలి. 

అనేక సంవత్సరాలుగా నిభందనలకు అనుగుణంగా ఉద్యోగ సమస్యలపై పని చేస్తున్న ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు కల్పించాలి: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో సుమారు 130 శాఖాధిపతుల పర్యవేక్షణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగ ఉపాద్యాయ కార్మికులు మరియు ఆయా కేటగిరిల నుండి పదవీ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులు కలసి సుమారు 10 లక్షల మంది పని చేస్తుండగా వాటిలో వివిధ శాఖలకు సంభందిచిన అనేక ఉద్యోగ సంఘాలు గుర్తిపు కోసం దరఖాస్తు చేస్తే గత చాల ఏళ్ళు గా తిరస్కరిస్తున్న ప్రభుత్వం, ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం సదరు నిభంధలన్ని సడలిస్తూ ఏకపక్షంగా ఒక సంఘానికి గుర్తిపు మంజూరు చెయ్యడంపై APJAC అమరావతి కౌన్సిల్ సమావేశం లో వివిధ శాఖల ఉద్యోగ సంఘాలు నుండి తీవ్ర అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేయడం జరిగినది. కావున ఉద్యోగుల మరియు ఉద్యోగ సంఘాల మద్య అనైక్యతను రగిలిస్తున్న ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా, నిభందనల ప్రకారం అర్హత ఉండి , ప్రభ్యుత్వ గుర్తింపు కొరకు ఎదురుచూస్తున్న శాఖాపరమైన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు చట్టబద్ధంగా ప్రభుత్వం వెంటనే గుర్తింపు ఉతర్వులు జారీచేయాలి. 

గుర్తిపు పొంచిన ఉద్యోగ సంఘాలో ఒక ఉద్యోగి కి ఒక సంఘంలో మాత్రమే సభ్యత్వం ఉండాలి:ప్రభుత్వం గుర్తించిన ఉద్యోగ సంఘాలకొరకు రూపొందించిన ‘ROSA’ రూల్స్ కి లోబడి పనిచేస్తున్న ఉద్యోగ సంఘాలలో ఈమధ్య కాలంలో వ్యక్తిగత గుర్తింపు కోసం చోటుచేసుకుంటున్న విపరీత పరిణామాల దృష్ట్యా “ఒక ఉద్యోగి ఓకే ఉద్యోగ సంఘంలో మాత్రమే సభ్యత్వం” ఉండే విధానాన్ని తీసుకొనిరావడం ద్వారా ఉద్యోగులకు వివిధ సంఘాలలో Dual Membership రద్దు చేయాలి.

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి :

  • ప్రధాన పాధ్యాయులను ఉప విద్యాధికారులు (డిప్యూటి డి .ఇ.ఒ) గా నియమించాలి :
  • గత చాల కాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీసు నిభందనలను అమలు పరచాలి. 
  • మరియు ఇతర ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి నివేదించిన సమస్యలను పరిష్కరించాలి. 

మున్సిపాలిటిలు మరియు కార్పోరేషన్ ఉద్యోగులకు ఉమ్మడి సర్వీసు రూల్సు అమలు చేయాలి: ఎంతో కాలంగా పెండింగులో ఉన్న మునిసిపల్  కార్పోరేషన్లు మరియు మున్సిపాలిటీల ఉద్యోగుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుపరచాలి.  మునిసిపల్ శాఖలో చాలా కాలంగా పెండింగ్ లో వున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు మరియు కార్మికులు అందరకీ GPF అమాలుపరచాలి.

పదోన్నతులు అమలు కాకుండా నిలిచిపోయిన 1380 మంది భాషోపాధ్యయులకు సూపర్ న్యూమరి పోస్టులు ఏర్పాటు చేసి పదోన్నతులు అమలు చేయాలి : రాష్ట ప్రభుత్వం లో సుదీర్ఘకాలం గా పెండింగ్ ఉన్న భాషోపధ్యయుల సమస్య పరిష్కారానికి గాను 10224 మంది భాషోపాధ్యయులకు మరియు 2603 మంది వ్యాయమ ఉపాపాధ్యయులకు స్కూల్ అసిస్టెంట్ లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉతర్వులు జారీ చేసినప్పటికీ ఇంకా 1380 మంది తెలుగు ,హిందీ ,ఉర్దూ మరియు ఒరియా భాషోపాధ్యయులకు పదోన్నతులు అమలు కానందున సూపర్ న్యూమరి పోస్టులు ఏర్పాటు చేసి వారికి పదోన్నతులు అమలు చేయాలి.

ఉపాద్యాయుల బదిలీలు మాదిరిగానే ఉద్యోగుల బదిలీలు కూడా ఆన్ లైన్ కౌన్సిలింగ్ విధానం ద్వారా పారదర్శకంగా నిర్వహించాలి: ప్రభుత్వ ఉద్యోగుల బదలలీలు ప్రభుత్వాలు మరియు అధికారులు మారినప్పుడల్లా క్రొత్త విదానం లో నిర్వహించడం మరియు సంభదిత అధికారులపై అనేకవిధాలుగా వత్తిడి చేయడం మొదలగు కారణాలవలన ప్రతిసారి ఉద్యోగుల బదిలీలలో గందరగోళం నెలకొని పారదర్శకంగా జరగడంలేదని ఆరోపణలు వస్తున్నవి. కావున ప్రతి సంవత్సరము ఒక నిర్దిష్ట సమయములో, ఉపాధ్యాయులకు చేస్తున్న బదిలీలు మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆన్ లైన్ కౌన్సిలింగ్ విధానం ద్వారా బదిలీలు పారదర్శకంగా నిర్వహిచాలి . 

కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలన్నీ నిర్ణిత కాలవ్యవధిలో పరిష్కరించాలి : 
  • ప్రభ్యుత్వ ఉద్యోగులకు మరియు ప్రభుత్వ వ్యవస్థలలో అనేక ఇతర విభాగాలలో పదవీ విరమణ 58 నుండి 60 సంవత్సరాలకు పెంచినప్పటికీ ప్రభుత్వోద్యోగులతో సమానం గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు నేటికి పెంచిఉండనందున, కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలనుండి 60 సంవత్సరాల కు పెంచాలి. 
  • అర్హత కలిగిన “కాంట్రాక్టు ఉద్యోగులందరి సర్వీసులను క్రమబద్ధీకరణ చేయాలి”
  • కాంట్రాక్టు ఉద్యోగులు అధికముగా ఉన్న శాఖలలో రెగ్యులర్ ఉదోగాలు చేపట్టే సమయములో కాంట్రాక్టు పోస్టులలో పని చేస్తున్న వారి స్థానాలను ఖాళీలుగా చూపకుండా చర్యలు తీసుకోవాలి.
  • కాంట్రాక్టు ఉద్యోగులందరి EHS విధానాన్ని అమలు చేస్తూ హెల్త్ కార్డ్స్ జారీ చేయాలి.
  • కొన్ని శాఖలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తదితర ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందకపోకడం వలన చిన్న స్ధాయి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని, ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయడంలో కీలకపాత్ర వహిస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
  • అంతేకాక 2003 లో నియామకమై అప్పటినుండి నిర్దారిత పెస్కేల్స్ ద్వారా జీతాలు పొందుతున్న వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా Go.No. 27 ద్వారా కన్సాలిడేటెడ్ జీతాలుగా మార్పు చేయడం వలన PRC అమలును కోల్పోయిన సుమారు నాలుగువేల మంది ఉద్యోగులకు పే స్కేల్స్ ద్వారా జీతాలు చెల్లిస్తూ PRC అమలు చేయాలి.
పొరుగు సేవల ఉద్యోగులు :
  • పోరుగుసేవల ఉద్యోగుల ఏజెన్సీల వ్యవహార శైలితో అనేక రకాల ఇబ్బందుల పడ్డ పొరుగు సేవల సిబ్బందికి , గౌ.ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి చొరవతో పోరుగుసేవల కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారికీ ఉద్యోగ భద్రత కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ...
  • ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న “పొరుగు సేవల ఉద్యోగుల జీతాలు పెంచాలి”.
  • క్రొత్తగా పోరుగుసేవల ఉద్యోగుల కొరకు కార్పోరేషన్ ఏర్పాటు చేసినందున, ప్రస్తుతం ఉన్న పోరుగుసేవల ఉద్యోగులను తొలగిస్తారని ఆందోళనలో ఉన్నందున ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టతనిచ్చి ఎవరిని ఉద్యోగాలనుండి తొలగించకుండా తగు ఆదేశాలు జారీ చేయాలి.

విద్యుత్ శాఖలో వివిధ కంపెనీలలో పనిచేస్తున్న సిబ్బందికి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించాలి:
  • విద్యుత్ శాఖలో ఎపి ఎలక్ట్రిసిటీ బోర్డు సంస్థలో రద్దు చేసి ఎపి.జెన్ కో, ఎపి.ట్రాన్స్ కో, ఎపి ఇ.పి.డి.సి.ఎల్ మరియు ఎపి.ఎస్.పి.డి.సి.ఎల్ గా కంపెనిలుగా విభజించిన తదుపరి 1999 పిబ్రవరి 1వ తేది వరకు పని చేసిన ఉద్యోగులందరికీ GPF సదుపాయం పెన్షన్ సదుపాయం రద్దు చేసి EPF విధానం అమలుచేయడం ద్వారా పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు రూ. 1000 నుండి 2500మాత్రమే పెన్షన్ గా పొందటం జరుగుతున్నది. సదరు స్వల్ప మొత్తం తో కుటుంబ పోషణ భారంగా మారుతున్నందున, GPF సదుపాయం కల్పించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
  • గత 20 సంవత్సరాలు పైబడి వివిధ విద్యుత్ కంపెనీలలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తూ అర్హత కలిగిన ఉద్యోగులందరినీ ఆయా కంపెనిలలో విలీనం చేస్తూ వారి సర్వీసులను క్రమబద్దీకరించాలి. 

N.M.R, డైలీ వేజస్ పార్ట్ టైం, ఫుల్ టైం కంటిజేంట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దికరించాలి : 25.11.1993 తేదీ కి ముందు నియమించబడిన 27 సంవత్సరాలకు పైబడి ప్రభుత్వ శాఖలలో పని చేస్తూ ఇప్పటికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడని “యన్.యం.ఆర్, డైలీ వేజస్, పార్ట్ టైం ఫుల్ టైం కంటిజేంట్ ఉద్యోగులందరి సర్వీసులను కోర్టు ఉత్తర్వులకు లోబడి వెంటనే క్రమబద్ధీకరించాలి”.

ఇజినీర్ల సమస్యల పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ కమిటీ సిఫారసులు అమలు చేయాలి; సుదీర్ఘ కాలంగా అపరిష్కుతం గా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఇంజినీర్ల సమస్యల పరిష్కారానికి గాను టాస్క్ ఫోర్స్ కమిటీ సిఫారసులను వెంటనే అమలుచేయాలి. 

‘Work Charged’ ఉద్యోగుల హోదాను ‘ఇంజనీరింగ్ సబార్డినేట్ గా మార్చాలి’: వివిధ ఇంజినీరింగ్ విభాగాలలో పనిచేస్తున్న వర్కు చార్జేడ్ ఉద్యోగులకు “Work Charged అనే పదాన్ని తొలగించి” ఇంజనీరింగ్ సబార్డినేట్ గా పేరు మార్పు చేసి, వారి “జీతాలను 010 పద్దు కింద చెల్లించాలి”. 

సహకార శాఖలో గత 26 సంవత్సరాలుగా నియామకాలు చేయని పోస్టులలో తాత్కాలిక పదోన్నతులు కల్పించాలి :
సహకార శాఖలో గత 26 సంవత్సరాలు గా నియామకాలు లేని జూనియర్ ఇన్ స్పెక్టర్ మరియు అసిస్టెంట్ రిజిస్త్రార్ పోస్టులలో తాత్కాలిక పదోన్నతులు ( అడహక్ ప్రొమోషన్ లు ) ఇచ్చి ఆయా కేటగిరి ఉద్యోగులకు పనివత్తిడి తగ్గించాలి. 
వితంతు కుమార్తెల అర్హత వయస్సు తొలగించాలి: “వితంతు కుమార్తెలకు ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్” మంజూరు కొరకు 45సం. ల లోపు అనే వయస్సు పరిమితిని తొలగించాలి. 

సంవత్సరముల పిల్లల సంరక్షణ సెలవు రెండు సంవత్సరములకు పెంచాలి: కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగినిలకు పిల్లల సంరక్షణ కొరకు రెండు సంవస్తరములు శెలవు సదుపాయం మంజూరు చేయగా రాష్ర ప్రభుత్వం మాత్రం కేవలం రెండు నెలలు మాత్రమే పిల్లల సంరక్షణకు శెలవు మంజూరు చేసినది. కావున రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగినులకు కూడా “రెండు సంవత్సరముల పిల్లల సంరక్షణ సెలవు” (Child Care Leave) మంజూరు చేయాలి. 

ప్రసూతి సెలవులోకి వెళ్ళిన మహిళా ఉద్యోగినుల ప్రొబేషన్ కాలాన్ని పొడిగించ కుండా ఉతర్వులు ఇవ్వాలి:
  • ఉద్యోగం వచ్చిన రెండు సంవత్సరముల లోపు “ప్రసూతి సెలవులోకి వెళ్ళిన మహిళా ఉద్యోగినుల ప్రొబేషన్ కాలాన్ని పొడిగించ కుండా ఉండే విధం గా ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు మంజూరు చెయ్యాలి.
  • మహిళా ఉపాధ్యాయులకు ఇస్తున్న అయిదు రోజుల ప్రత్యేఖ శెలవులను వివిధ శాఖలలో అందరి మహిళా ఉద్యోగులకు కూడా మంజూరు చేయాలి.
వివిధ డిపార్ట్ మెంట్ పనిచేస్తున్న టెక్నికల్ ఆఫిసర్స్కు గజిటెడ్ హోదా కల్పించాలి : నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్డులు మరియు భవనాలు శాఖ తదితర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న టెక్నికల్ ఆఫీసర్స్ కు గత చాల కాలంగా పెండింగ్ గజిటెడ్ హోదాను కల్పిస్తూ ఉతర్వులు జారీ చేయాలి. 

పోలీస్ కానిస్టేబుల్ పెస్కెలు కనీసం సెకెండరీ గ్రేడ్ టిచర్ స్కేలు స్థాయిలో ఉండాలి : జనాభా ప్రాతిపదికన పోలిస్ శాఖలో క్రింది స్థాయిలో కానిస్టేబుల్ పోస్టులను పెంచకపోవడమే కాకుండా, ఉన్న ఖాళిలలో నియామకాలు జరపనందున, 24 గంటలు భాద్యతలు నిర్వర్తించడానికి సిద్దపడుతు , నేరపరిశోధనలో ఎదురౌతున్న పెనుసవాళ్ళను తట్టుకొంటూ తీవ్రమైన వత్తిడితో మరియు ప్రమాదకర పరిస్థితులలో ఉద్యోగ భాద్యతలు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్స్ కు గతం లో మాదిరిగా సెకండరి గ్రేడ్ టిచర్ల తో సమానమైన స్కేలు ను చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీచెయ్యాలి. 

పోలిస్ శాఖలో దీర్గకాలంగా ఉన్న మినిస్టిరియల్ ఉద్యోగుల న్యాయబద్దమైన సమస్యలను పరిష్కరించాలి.:
  • పోలిస్ శాఖలో 87 టైపిస్ట్ పోస్టులు సరెండర్ చేస్తూ 40 అసిస్టెంట్ అడ్మినిస్త్రేటివ్ ఆఫీసర్ పోస్టులు మంజూరు చేసే ప్రతిపాదనలు DGP ప్రభుత్వానికి చేరిన గత సంవత్సర కాలం నుండి ఆర్ధిక శాఖలో పెండింగ్ లో ఉన్నదున, ఏవిధమైన ఆర్ధికభారం లేని సదరు ప్రతిపాదనలు త్వరితగతిన ఆమోదించి సత్వరమే పోలీస్ శాఖ లో 40 అసిస్టెంట్ అడ్మినిస్త్రేటివ్ ఆఫీసర్ పోస్టులు మంజూరు చేయాలి.
  • పోలిస్ శాఖలో మినిస్టిరియల్ ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం వలన పని వత్తిడి ఎక్కువగా ఉంటున్నది. 1978 నాటికీ జిల్లాకు 700 నుచి 800 క్షేత్ర స్థాయి పోస్టులు ఉండగా, తదుపరి పెరిగిన జనాభా మరియు మారిన సామాజిక పరిస్థితుల దృష్ట్యా నేటివరకు 3 సార్లు అదనపు పోస్టులు మంజూరు చేయడం వలన నేడు ప్రతి జిల్లాలో పోలిస్ శాఖలో 2500 నుండి 3000 మంది క్షేత్ర స్థాయి సిబ్బంది పని చేస్తున్నారు. కానీ కార్యాలయాలలో పనిచేసే మినిస్టిరియల్ ఉద్యోగుల పోస్టులు 1978 నుండి పెంచి యుండలేదు. కావున సూపరింటెండెంట్ – 1, సీనియర్ అసిస్టెంట్ – 2, జూనియర్ అసిస్టెంట్ -4 లతో కూడిన 1 సెక్షన్ ప్రతియూనిట్ లోను మజూరు చేయాలి 

ప్రభుత్వ డాక్టర్లల సమస్యలను పరిష్కరించాలి :
  • భోధనా భాద్యతలను నిర్వర్తిస్తున్న ప్రభుత్వ డాక్టర్లకు UGC స్కేళ్ళ తో PRC అమలు చేయాలి.
  • ఆరోగ్య శాఖ డైరెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్లకు టైం బౌండ్ ప్రోమోషన్స్ ఇవ్వాలి
  • ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్న డాక్టర్లకు జీతాలు ట్రెజరీ నుండి జీతాలు చెల్లించాలి.

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ కు ప్రభుత్వ డాక్టర్ల తో సమానంగా జీతాలు మరియు అలవెన్స్ లు చెల్లించాలి. :
ప్రభుత్వ డాక్టర్ల తో సమానం గా విద్యార్హతలు కలిగి, క్షేత్ర స్థాయిలో అనేక వ్యయప్రయాసలతో ఉద్యోగ భాద్యతలు నిర్వర్తిస్తూ పశుసంవర్ధక శాఖలో పని చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ కు ప్రభుత్వ డాక్టర్ల తో సమానంగా జీతాలు మరియు అలవెన్స్ లు చెల్లించాలి.

వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ANM/MPHS/PHN/CHO కేడర్ల మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:
  • వైద్య ఆరోగ్య శాఖలో 2211 పద్దు కింద చెల్లించవలసిన జీతాలలో లోటుపాట్లను తొలగించి అందరికి సకాలములో జీతాలు అందేలా చూడాలి.
  • వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతుల కొరకు ఎదురు చూస్తున్న మహిళా ANM/MPHS లకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. 
  • వైద్య ఆరోగ్య శాఖలో డిస్త్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్స్ అనుసరించి నియమింపబడి అనేక సంవత్సరాలుగా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా అన్నిరకముల భాద్యతలు నిర్వర్తిస్తున్న EC ANMs ను వెంటనే క్రమబద్దికరించాలి మరియు 2 nd ANM లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 
దివ్యంగుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోని వచ్చిన RPWD act 2016 (Raights of Person with Disabled) చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి :2016 లో కేంద్ర ప్రభుత్వం దివ్యంగుల హక్కుల కోసం ప్రవేశపెట్టిన RPWD act 2016 చట్టాన్ని ఇప్పటికే తెలగాణ రాష్ట్రం తో సహా 13 రాష్ట్రాలు అమలు చేస్తూ మిగిలిన రాష్టాలు కూడా ఆదిశగా అడుగులు వేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా దివ్యంగులకు హక్కులు సౌకర్యాలు కల్పించే నిమిత్తము RPWD Act 2016 చట్టాన్ని అమలు చేయాలి. 

విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చే పూర్తి స్థాయి పెన్షన్ కోసం ఇచ్చే వెయిటేజ్ 5 నుండి 8 సంవత్సరాలకు పెంచాలి :
ప్రస్తుత కాలములో అధిక విద్యార్హతలు సాధించడం మరియు ప్రతి సంవత్సరము ప్రభుత్వ ఉద్యోగాలు నియామకం జరగని కారణముగా ఉద్యోగములో చేరుతున్న వారి వయస్సు 32 – 35 సం. వుంటుంది. కనుక దీనిని దృష్టిలో వుంచుకొని ప్రభుత్వం ఫుల్ పెన్షన్ కొరకు ఇచ్చే 5సం. వెయిటేజ్ ను 8సం.లకు పెంచ వలసినదిగా కోరుచున్నాము.

ఏపీ మోడల్ స్కూల్ లో ఉద్యోగులను విద్యా శాఖ పరిధిలోనికి తీసుకొని రావాలి: గౌరవ MLC ల కమిటీ నివేదికను అనుసరించి ఏపీ మోడల్ స్కూల్ లో ఉద్యోగులకు వాటి పర్యవేక్షణను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోనికి తీసుకొని వచ్చి వారికి కూడా 010 పద్దులో ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించే విధముగా చర్యలు తీసుకోవాలి. 

ప్రభుత్వ శాఖలలో టైపిస్ట్ అనే పేరును ‘కంప్యూటర్ అసిస్టెంట్’ గా మార్పుచేయాలి : టైప్ మిషన్ స్థానాలలో చాలాకాలంగా కంప్యూటర్లు వాడుతున్నప్పటికీ సర్వీసు రూల్సు లో టైపిస్టు అనే పదము మారలేదు, కనుక టైపిస్ట్ అనే పేరును మరియు ఉద్యోగ అర్హతలను సబార్డినేట్ రూల్స్ నుండి తొలగించి కొత్తగా ‘కంప్యూటర్ అసిస్టెంట్’ గా మార్పు చేసి వాటి అర్హతలను సర్వీస్ రూల్స్ లో కొత్తగా నిర్దేశించాలి.


   (బొప్పరాజు వెంకటేశ్వర్లు)                                                                    (వై. వెంకటేశ్వర రావు)
        సెక్రెటరీ జనరల్                                                                                        చైర్మన్
   
         
                                                           
(వి. వి. మురళి కృష్ణ నాయుడు)                                                            (టి.వి. ఫణి పేర్రాజు)
        ట్రెజరర్                                                                                      అసోసియేట్ చైర్మన్









x